అంగ్ సాన్ సూకీ అనగానే ఓ పోరాట యోధురాలు. ఓ స్ఫూర్తి మంత్రం. మయన్మార్ దేశంలో ప్రజాస్వామ్య ఏర్పాటు కోసం ఉద్యమించిన గొప్ప వనిత, నోబెల్ శాంతి బహుమతి గ్రహిత. ఎక్కడ మయన్మార్ దేశం..ఎక్కడ అనంతపురం జిల్లా.. ఇంతకీ సూకీ ఈ ఊరు ఎందుకు రాబోతుందా తెలుసా..ఇక్కడి మహిళల విజయగాధలని వినడానికి.. కరువు సీమలో అద్భుతాలని సాధించిన మహిళా రైతులని అభినందించడానికి ఆంగ్ సాన్ సూకీ వస్తున్నారు. దీంతో ఇప్పుడు పాపానిపల్లి గ్రామం ప్రపంచం దృష్టిని ఆకర్శిస్తోంది.  మహిళా సంఘాల పనితీరు భేష్ మహిళా స్వావ లంబనకోసం ఏర్పాటు చేసిన మహిళా సంఘాలు పాపసాని పల్లి గ్రామంలో అద్భుత ఫలితాలను ఇచ్చాయి. తీసుకున్న అప్పులు చెల్లించడంలో ముందుండటమే కాకుండా సేంద్రియ వ్యవసాయం చేయడంతోనూ తమకి తామే సాటి అని పాపసాని పల్లి స్త్రీలు నిరూపించారు. గ్రామ జనాభా ఎనిమిది వందల మంది మాత్రమే. అయినా గ్రామ మహిళలంతా అద్భుత పనితీరుతో 16 మహిళా స్వయం సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. యాభై లక్షల రూపాయల వరకూ లోన్ తీసుకుని 95 శాతం తిరిగి కట్టేశారు.  సేంద్రియ వ్యవసాయంతో మంచి ఫలితాలు 437 ఎకరాల్లో సేంద్రియ విధానంతో వ్యవసాయం చేపట్టారు. 40 రకాల పంటలని సాగు చేస్తూ పురుషులకి తామేం తీసిపోమని నిరూపించారు. అంతేగాకుండా సేంద్రియ పద్దతిలో శ్రీవరి సాగు చేసి మంచి ఫలితాలు పొందారు. అందుకే అంగ్ సాన్ సూకీ వంటి స్ఫూర్తి కలిగించే మహిళానేత కూడా వీరి ప్రగతిని చూసేందుకు ఇక్కడికి వస్తున్నారు. పాపసాని పల్లి వచ్చిన అంగ్ సాన్ సూకీ గ్రామంలోని సప్తగిరి మహిళా సంఘం సభ్యురాలు మద్దక్క అనే మహిళ ఇంటికి రాబోతున్నారు. ప్రపంచానికే స్పూర్తినిచ్చే సూకీ లాంటి గొప్ప నేత తమ గ్రామానికి వస్తుండటంతో గ్రామస్తులంతా ఆమె రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ గ్రామ ప్రజల్లా స్వశక్తితో ముందుకు సాగితే పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్న గాంధీజీ మాటలు అక్షరాలా నిజం అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: